- మెడికల్ కాలేజీలో పీజీ సీట్లకు దరఖాస్తు చేయాలని డీఎంఈకి ఆదేశం
- ఉమ్మడి కరీంనగర్‌లో సిజేరియన్లు తగ్గించేందుకు నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ.. పబ్లిక్ హెల్త్‌పై సమీక్షలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: జగిత్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో త్వరలోనే అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అందుకోసం అత్యాధునిక వసతులతో నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేశామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో జగిత్యాల్ మెడికల్ కాలేజీ, జీజీహెచ్, ఏరియా హాస్పిటళ్ల పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
జిల్లా ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు జగిత్యాల మెడికల్ కాలేజీలో అన్నిరకాల పీజీ డిపార్ట్‌మెంట్లు ప్రారంభించేలా పీజీ సీట్ల కోసం ఎన్‌ఎంసీకి వెంటనే దరఖాస్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)ను ఆదేశించారు. త్వరలోనే కోరుట్ల, మెట్‌పల్లి సహా అన్ని హాస్పిటళ్లకు కొత్త డాక్టర్లు వస్తారని హామీ ఇచ్చారు. జగిత్యాల జీజీహెచ్‌ను స్పెషాలిటీ వైద్య సేవల కేంద్రంగా, కరీంనగర్ జీజీహెచ్‌ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.
సిజేరియన్ల తగ్గింపునకు చర్యలు
జగిత్యాల జీజీహెచ్‌లో ఓపీ, ఐపీ సంఖ్య పెరిగి.. సేవల తీరు మెరుగైందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వివరించారు. నూతన హాస్పిటల్ భవనం మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కోరుట్ల ఏరియా హాస్పిటల్‌లో గతంలో నెలకు సగటున 550 డెలివరీలు జరిగితే.. ఇప్పుడు ఆ సంఖ్య 950కి పెరిగిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. అయితే సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున సాధారణ ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, రోగుల సంఖ్య పెరిగినందున కోరుట్ల ఏరియా హాస్పిటల్, మెట్‌పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కేడర్ స్ట్రెంత్‌ను పెంచాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు.
గత పదేండ్ల రికార్డులను పరిశీలిస్తే దేశంలోనే అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సిజేరియన్ డెలివరీలు జరుగుతుండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న నమ్మకాలు, డాక్టర్ల తొందరపాటులాంటి కారణాలతో సిజేరియన్లు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలపగా.. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే నర్సులకు ప్రత్యేకంగా మిడ్‌వైఫరీ శిక్షణ ఇప్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ మంది నర్సులకు శిక్షణ ఇచ్చి నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఏరియా హాస్పిటళ్ల వరకు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
